రాష్ట్రంలో ప్రతి యాత్రా స్థలం కోటప్పకొండలా ఉండాలని సినీ నటులు, రచయిత గొల్లపూడి మారుతిరావు అన్నారు. శనివారం సాయత్రం శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావుతో కలిసి ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ గతంలో తాను ఒకటి రెండుసార్లు వచ్చాను గాని ఈసారి చాలా నిశితంగా గమనించానని, భక్తితో పాటు మానసిక ఉల్లాసం కూడా కలిగిందన్నారు. దేవస్థానం ప్రాంతమంతా పరిశుభ్రతకు మారుపేరుగా ఉందన్నారు.
పంచ సహస్రవధాని మేడసాని మోహన్ మాట్లాడుతూ మేథోదక్షిణామూర్తిని లింగాకార రూపంలో దర్శనం చేసుకోవటం తనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు. ఇక్కడ నిర్వహణ తీరు చాలా బాగుందని ప్రశంసించారు. సభాపతి డాక్టర్ కోడెల, గొల్లపూడి మారుతిరావు, మేడసాని మోహన్ తదితరులు మొదట ఘాట్ రోడ్డులోని పర్యావరణ పర్యాటక క్షేత్రాన్ని తిరిగి చూశారు. ఆలయన ప్రతినిధులు వారికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. త్రికోటేశ్వరునికి అర్చన నిర్వహించారు. అర్చకులు మహానంది మంటపంలో ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు, స్వామి వారి జ్ఞాపికలను అతిథులకు అందజేశారు. దేవస్థాన ఈవో డి.శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు.