Category Archives: News
త్రికోటేశ్వరునికి లక్ష మల్లెపూల అర్చన
- వైశాఖ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండలోని త్రికోటేశ్వరునికి బుధవారం రాత్రి లక్ష మల్లెపూల అర్చన నిర్వహించారు. వంశపారంపర్య ధర్మకర్త రాజామల్రాజ్ రామకృష్ణ తదితరులు అర్చన కార్యక్రమంలో పాల్గొన్నారు.
- భక్తులతో గర్భగుడి మొత్తం నిండిపోయింది. రాత్రి 8.30 గంటలకు అర్చన పూర్తయింది. అనంతరం స్వామివారికి హారతి కార్యక్రమం నిర్వహించారు.
- స్వామివారికి మల్లెపూలను వెంకయ్యచౌదరి సమర్పించారు. మామిడికాయలు, విసనకర్రలను ధర్మకర్త రామకృష్ణ, పిచ్చయ్య కోడూరి గోపాలకృష్ణ తదితరులు సమర్పించారు.
రూ.4.5 కోట్లతో నిర్మాణాలు
రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కోటప్పకొండ పర్యటక శోభను సంతరించుకోనుంది. ఇందుకోసం రూ.4.5 కోట్లు మంజూరు కాగా మహాశివరాత్రికి ముందే పనులు ప్రారంభమయ్యాయి. అయితే నిధుల కొరతతో కొద్ది రోజులు అవి ఆగినా తిరిగి నిధులు మంజూరు కావడంతో మెట్ల మార్గం పక్కనే ఉన్న కోనేరు వద్ద పలు కట్టడాలకు రంగం సిద్ధమైంది.
- కోనేరు పక్కనే నిర్మిస్తున్న భవనంలో యాత్రికుల కోసం రెస్టారెంటు ఏర్పాటు చేస్తారు.
- ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వాహనాలు నిలుపు స్థలం సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
- భవిష్యత్తులో రూపుదిద్దబోయే రోప్‌వే కోసం వేచి ఉండేందుకు కొండ కింద, పైన రెండు స్టేషన్లు నిర్మిస్తారు. ఇందుకుగాను దీని నిర్మాణంలో అనుభవం ఉన్న కన్సల్టెంట్లను నియమించినట్లు తెలిసింది. త్వరలో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
- ఇప్పటికే కొండ వద్ద తితిదే ఆధ్వర్యంలో యాత్రి నివాస్ భారీ భవనాన్ని నిర్మించగా వేద పాఠశాల భవనం, విద్యార్థులు, అధ్యాపకులకు వసతి గృహాలు ఏర్పర్చారు.
- తాజాగా మెట్ల మార్గం పక్కనే నిర్మించే రెస్టారెంటు కూడా ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది.
- కోనేరు వద్దనే సౌండ్ అండ్ డ్రామా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు కూర్చునేలా మెట్ల నిర్మాణం పూర్తయింది. కోటప్పకొండ చరిత్ర మొత్తం సౌండ్ అండ్ డ్రామా ద్వారా ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు ప్రత్యేక షో ప్రదర్శిస్తారు.
- పర్యటక క్షేత్రంలో అడుగు పెట్టగానే ప్రత్యేకంగా చేపల కొలను, భారీ అక్వేరియం నిర్మించారు. వాటితోపాటు నెమళ్లను పెంచేందుకు పెద్ద షెడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు.
ఇవన్నీ పూర్తయితే ఆధ్యాత్మికంతోపాటు పర్యటకం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.
పెరిగిన త్రికోటేశ్వరుని ఆలయ కౌలు ఆదాయం
కోటప్పకొండ త్రికోటేశ్వరుని దేవస్థాన భూముల కౌలు వేలం పాటలు కారణంగా రూ.35 వేలు ఆదాయం అధికంగా వచ్చిందని దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు తెలిపారు. సాతులూరు గ్రామంలో 11.4 ఎకరాల భూములను కౌలుకు వేలం నిర్వహించగా రూ.1,24,400 లభించిందన్నారు.
గత ఏడాది రూ.92,350 మాత్రమే వచ్చిందన్నారు. ఈ ఏడాది రైతులు అక్కడికక్కడే కౌలు డబ్బులు చెల్లించారని వివరించారు.
వైభవంగా లింగోద్భవ అభిషేకాలు
- త్రికోటేశ్వరస్వామికి శుక్రవారం అర్ధరాత్రి అత్యంత వైభవంగా లింగోద్భవ అభిషేకాలు నిర్వహించారు.
- పాలు, పెరుగు, తేనె, నెయ్యి, శుష్కఫలాలు, పండ్ల రసాలు, విభూది, గంధం ఇలా అనేక రకాల ద్రవ్యాలతో తెల్లవార్లు వేద మంత్రోచ్ఛరణ మధ్య అభిషేకాలు సాగాయి.
- చివరిలో పన్నీరు, గంగాజలంతో స్వామివారి అభిషేకం పూర్తయింది.
- దేవస్థాన వంశపారంపర్య ధర్మకర్త రాజామల్రాజ్ రామకృష్ణ దంపతులు, దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు, పాలక మండలి సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- విఘ్నేశ్వర పూజతో అభిషేకాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాముకు అభిషేకాలు పూర్తయ్యాయి.
త్రికోటేశ్వరుని ఆదాయం రూ.కోటి 5లక్షలు
గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మహాశివరాత్రికి త్రికోటేశ్వరునికి సుమారు రూ.3లక్షలు పైచిలుకు ఆదాయం తగ్గింది. గత ఏడాది కోటి 9 లక్షల పైచిలుకు ఆదాయం లభించింది.
మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి రూ.1,05,85,830 ఆదాయంగా లభించింది. శనివారం దేవస్థాన అధికారులు హుండీ ఆదాయం లెక్కించారు.
- పూజల టిక్కెట్ల ద్వారా రూ.33,42,565
- హుండీల ద్వారా రూ.45,06,451
- ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.26,31,620
- విరాళాలు ఇతరత్రా రూ.64,374
- రద్దయిన పెద్ద నోట్లు రూ.40,000
- విదేశీ కరెన్సీ రూ.820 చొప్పున లభించాయి.
- బంగారం 14 గ్రాములు,
- వెండి 703 గ్రాములు లభించింది.
హర హారో చేదుకో కోటయ్య …
- మధ్యాహ్నం నుంచి భక్తులు పెరగడంతో కోటప్పకొండలో నాలుగు రహదారుల కూడలి కిటకిటలాడింది.
- సాయంత్రం 5గంటల సమయంలో మెట్ల దారి రద్దీగా మారింది.
- ప్రసాదాల కౌంటర్లు ఉదయం నుంచి రద్దీగా ఉన్నాయి. సాయంత్రం ఆరు గంటలకు లక్షా 30 వేల లడ్డూలు భక్తులు కొనుగోలు చేశారు. అదేవిధంగా 40 వేల అరిసెలు కొనుగోలు చేశారు.
- రాత్రి వేళ ఆలయం, ప్రభలు దేదేప్యమానంగా వెలుగొందాయి.
- పురుషోత్తమపట్నం గ్రామం నుంచి వచ్చిన ఆరు విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు సేవలందించేందుకు పలు సంస్థలు పోటీ పడ్డాయి.
- జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు 50 మంది ఉదయం నుంచి క్యూలైన్లలో భక్తులకు మంచినీరు అందజేశారు.
- అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ 125 మంది కొండ వద్ద సేవలందించారు.
- ఫ్రెండ్లీ పోలీసు పేరుతో పోలీసు సేవాదళ్ సభ్యులు వికలాంగులకు, అంధులకు, వృద్ధులకు సేవలందించారు.
45 ఏళ్లుగా హాజరవుతున్నా: సభాపతి కోడెల
మేథా దక్షిణామూర్తి త్రికోటేశ్వరుని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తజనాన్ని ఆశీర్వదిస్తున్నారు. చేదుకో కోటయ్య.. ఆదుకో కోటయ్య అంటూ భక్తజనులు పిలిస్తే పలికే దైవం ఆయన. 45 ఏళ్లుగా కోటప్పకొండకు హాజరవుతున్నా. మెట్ల మార్గంలో వచ్చి దర్శించుకున్నా. ఘాట్‌రోడ్డులో వచ్చి దర్శించుకుంటున్నా. స్వామివారికి సేవ చేసే అదృష్టం దక్కింది. భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయగలిగాం. పర్యావరణ పర్యాటక క్షేత్రం కూడా ఏర్పాటు చేశాం. అతి పెద్ద పుణ్యక్షేత్రంగా భవిష్యత్తులో మారుతుంది.
ఈరోజు తిరుణాల చిత్రాలు
త్రికోటేశ్వరుని మొదటి పూజ
ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బిందె తీర్ధంతో మహాశివరాత్రి వేడుక ప్రారంభం అయ్యింది. అభిషేకం అనంతరం స్వామికి అలంకరణ చేశారు. రెండు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు.