వైశాఖ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన కార్యక్రమాన్ని శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభమైన పూజ 8 గంటలకు ముగిసింది. దేవస్థాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య మల్లెపూలతో చేసిన అర్చన భక్తజనులను పులకింప చేసింది. అనంతరం స్వామి వారికి నైవేద్యం, మంగళ హారతి సమర్పించారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మల్లెపూలను దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి, వెంకటేశ్వరరెడ్డి సమర్పించగా మరో సభ్యుడు బెల్లంకొండ పిచ్చయ్య భక్తులకు విస్సనకర్రలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు. ప్రసాదాలను ముక్కు వెంకటేశ్వరరెడ్డి అందజేశారు. దేవస్థాన ఉద్యోగులు దగ్గరుండి ప్రసాదాలను భక్తులకు అందేలా చూశారు. వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.