రూ.4.5 కోట్లతో నిర్మాణాలు

రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన కోటప్పకొండ పర్యటక శోభను సంతరించుకోనుంది. ఇందుకోసం రూ.4.5 కోట్లు మంజూరు కాగా మహాశివరాత్రికి ముందే పనులు ప్రారంభమయ్యాయి. అయితే నిధుల కొరతతో కొద్ది రోజులు అవి ఆగినా తిరిగి నిధులు మంజూరు కావడంతో మెట్ల మార్గం పక్కనే ఉన్న కోనేరు వద్ద పలు కట్టడాలకు రంగం సిద్ధమైంది.

  1.  కోనేరు పక్కనే నిర్మిస్తున్న భవనంలో యాత్రికుల కోసం రెస్టారెంటు ఏర్పాటు చేస్తారు.
  2. ఆ ప్రాంతమంతా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పచ్చదనం పెంపునకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. వాహనాలు నిలుపు స్థలం సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.
  3. భవిష్యత్తులో రూపుదిద్దబోయే రోప్‌వే కోసం వేచి ఉండేందుకు కొండ కింద, పైన రెండు స్టేషన్లు నిర్మిస్తారు. ఇందుకుగాను దీని నిర్మాణంలో అనుభవం ఉన్న కన్సల్టెంట్లను నియమించినట్లు తెలిసింది. త్వరలో ఆయా పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
  4. ఇప్పటికే కొండ వద్ద తితిదే ఆధ్వర్యంలో యాత్రి నివాస్‌ భారీ భవనాన్ని నిర్మించగా వేద పాఠశాల భవనం, విద్యార్థులు, అధ్యాపకులకు వసతి గృహాలు ఏర్పర్చారు.
  5. తాజాగా మెట్ల మార్గం పక్కనే నిర్మించే రెస్టారెంటు కూడా ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది.
  6. కోనేరు వద్దనే సౌండ్‌ అండ్‌ డ్రామా కార్యక్రమాన్ని కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రేక్షకులు కూర్చునేలా మెట్ల నిర్మాణం పూర్తయింది. కోటప్పకొండ చరిత్ర మొత్తం సౌండ్‌ అండ్‌ డ్రామా ద్వారా ప్రేక్షకుల కళ్లకు కట్టినట్లు ప్రత్యేక షో ప్రదర్శిస్తారు.
  7. పర్యటక క్షేత్రంలో అడుగు పెట్టగానే ప్రత్యేకంగా చేపల కొలను, భారీ అక్వేరియం నిర్మించారు. వాటితోపాటు నెమళ్లను పెంచేందుకు పెద్ద షెడ్డు నిర్మాణ పనులు చేస్తున్నారు.

ఇవన్నీ పూర్తయితే ఆధ్యాత్మికంతోపాటు పర్యటకం పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

పెరిగిన త్రికోటేశ్వరుని ఆలయ కౌలు ఆదాయం

కోటప్పకొండ త్రికోటేశ్వరుని దేవస్థాన భూముల కౌలు వేలం పాటలు కారణంగా రూ.35 వేలు ఆదాయం అధికంగా వచ్చిందని దేవస్థాన సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు తెలిపారు. సాతులూరు గ్రామంలో 11.4 ఎకరాల భూములను కౌలుకు వేలం నిర్వహించగా రూ.1,24,400 లభించిందన్నారు.

గత ఏడాది రూ.92,350 మాత్రమే వచ్చిందన్నారు. ఈ ఏడాది రైతులు అక్కడికక్కడే కౌలు డబ్బులు చెల్లించారని వివరించారు.