ఈ రోజు రాత్రి నలుగు ప్రభల మీద విద్యుత్ అలంకరణతో డాన్సులు
ప్రత్యేకత చాటుతున్న పురుషోత్తమపట్నం వాసులు
శివయ్య మనసు దోచేలా ప్రభల తయారీ
150 ఏళ్లుగా సంప్రదాయం కొనసాగింపు
- పల్నాడు ప్రాంతంలో శివరాత్రి తిరునాళ్లు అనగానే గుర్తుకొచ్చేది ప్రభలే. ఈ పండగ సమయంలో ప్రతిఒక్కరూ ప్రభల గురించే చర్చించుకుంటారు.
- గ్రామాల నుంచి ప్రభలు కోటప్పకొండకు తరలించడం వేడుకగా సాగుతుంది. పల్నాడులోని పల్లెల నుంచి పెద్దఎత్తున ప్రభలను తరలిస్తారు. ఒక్క చిలకలూరిపేటలోని పురుషోత్తమపట్నంలో మాత్రం ప్రభలు తయారు చేయడంలో ప్రత్యేక గుర్తింపు ఉంది.
- ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతం నుంచి 9 ప్రభలను తయారు చేయడం ప్రత్యేకతను సాధించింది. ప్రభలను రూపొందించేందుకు రూ. కోటికి పైగా ఖర్చవుతుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే బంధువులు, స్నేహితులు ఒకే చోటకు చేరుకుని శివరాత్రి పండుగ నెల రోజుల ముందు నుంచే ప్రభల తయారీలో పాల్గొనడంతో ఇక్కడంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.
- మొదటల్లో తోట శేషాద్రినాయుడు, తోట కొండపు వెంకయ్య, గోవిందు పేరయ్య, తోట భగవతి, అచ్చుకోల అంజయ్య, తోట జానకిరామయ్య, అచ్చుకోల దర్మాద్రి, విడదల నరసింహారావు, విడదల అంకమ్మ, ఆసా కుటుంబం, కూనపరెడ్డి కుటుంబం, యాదవల పెద్దలు కలిసి వూరు మొత్తానికి ఒకే గ్రామ ప్రభను నిర్వహించేవారు.
- వేటపాలెం నుంచి పూసలు తీసుకుని వచ్చి ప్రభలకు అలంకరించేవారు. కులమతాలకు అతీతంగా ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రభను తయారు చేసి కొండకు తరలించేవారు.
- ప్రస్తుతం అదే ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం 9 ప్రభలను తయారు చేస్తున్నారు. ఒక్కొక్క ప్రభకు రూ.15 లక్షలు వరకు ఖర్చవుతుంది.
- ఒక్క ప్రభలకే రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నారంటే ఈ ప్రాంత ప్రజలు వీటికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతుంది.
- ఇతర ప్రాంతాల్లో పనిచేసేవారు ఎంత దూరంలోనున్న ఈ పండుగకు పురుష్తోమపట్నం చేరుకుంటారు. అమెరిక, లండన్, జర్మనీ, బెంగళూరు, చెన్నై.. ఇలా ఏ ప్రాంతంలో ఉన్న పండగ ముందు ఇక్కడకు చేరుకుని బంధుమిత్రులు, స్నేహితులతో సరదాగా గడుపుతారు.
- ఇతర దేశాలలో ఉన్న స్నేహితులను సైతం ఈ పండగకు తీసుకువస్తుంటారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా ప్రభల తయారీలో మునిగిపోతారు.
- ప్రభల తయారీ ప్రారంభించే సమయంలో, తయారు చేసిన ప్రభలను పైకి లేపే సమయంలో ప్రభల వద్ద తప్పట్లు, తాళాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 9 ప్రభల తయారీకి, వాటిని తరలించే సమయంలో సహకారం అందించుకుంటూ త్రికోటస్వామి సన్నిధికి చేరుస్తారు.
- గ్రామప్రభ, తోట పుల్లప్పతాత ప్రభ, విడదలవారి ప్రభ, బైరావారిప్రభ, చిన్నతోటవారి ప్రభ, తోట కృష్ణమ్మగారి ప్రభ, మండలనేనివారి ప్రభ, బ్రహ్మంగారి గుడి ప్రభ, యాదవల ప్రభలను ఏర్పాటు చేశారు. వీటిలో 6 విద్యుత్తు ప్రభలు.
- ప్రభలను తరలించేందుకు రాతి చక్రాల బండిని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ప్రయోగాత్మకంగా రెండు రాతిచక్రాలు, రెండు టైర్లు ఉండేలా బండిని తయారు చేసి కొండకు తరలిస్తున్నారు.
- తిరునాళ్ల ముగించుకుని ప్రభలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏర్పాటు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఆకుట్టకుంటున్నాయి.
- భక్తిశ్రద్ధలతో నిర్వహించే ప్రభలకు ఇచ్చే బహుమతులు కూడా పురుషోత్తమపట్నం ప్రభలకే ప్రతి ఏటా వస్తుండటం విశేషం. దీంతో పురుషోత్తమపట్నం అంటే ప్రభలు.. ప్రభలు అంటే పురుషోత్తమపట్నం అన్నట్టుగా మంచి గుర్తింపు పొందింది.