- రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కోటప్పకొండలో త్రికోటేశ్వరునికి బుధవారం అర్ధరాత్రి దాటాక ఆరుద్రోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు.
- అర్ధరాత్రి 12 గంటలకు పైకొండపై ఉన్న బొచ్చుకోటయ్య దేవస్థానం వద్ద జ్యోతి వెలిగించారు. భారీగా భక్తులు రావడంతో రెండు గంటల నుంచి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమయ్యాయి.
- గణపతి పూజ అనంతరం మహన్యాసకపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు.
- పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పండ్ల రసాలు, పండ్లు, శుష్కఫలాలు, విభూది, గంధం, నూనె, సుగంధ ద్రవ్యాలు, చివరగా అన్నాభిషేకం పూర్తయ్యే సరికి గురువారం ఉదయం ఏడు గంటలైంది.
- ఆ తర్వాత యాగశాలలో హోమాలు నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దేవస్థాన సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు, దర్మకర్తల మండలి సభ్యులు బెల్లంకొండ పిచ్చయ్య, నాగభూషణం, చెరుకూరి ప్రసాద్, అనుమోలు వెంకయ్య పాల్గొన్నారు.
- గత ఆరేళ్లుగా అన్నదానం నిర్వహిస్తున్న తాళ్ళ కోటిరెడ్డి, అల్లు రమేష్, విజయవాడకు చెందిన సీకో బయోటెక్స్ కోటిరెడ్డి ఈ ఏడాది కూడా కార్యక్రమాన్ని నిర్వహించారు.