కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయశాఖ సహాయ కమిషనర్ డి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. సభాపతి డాక్టర్ శివప్రసాదరావు సోమవారం ఉదయం మెట్ల మార్గం వద్ద నుంచి వేలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడతారన్నారు. ఎనిమిది కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఆయన స్వయంగా పాల్గొంటారని శ్రీనివాసరావు చెప్పారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు కారణంగా త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినట్లేనని ఆయన తెలిపారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది పురాణాలు చెబుతున్నాయన్నారు. ఈసారి కార్తీక సోమవారం నాడే పౌర్ణమి రావడంతో భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున, కాబట్టి తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామి వారికి అభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. ఘాట్‌రోడ్డులో ఆటోలు, ప్రైవేటు జీపులు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ట్రాక్టర్లను కూడా కొండ కిందే ఆపుకొని భక్తులు స్వామి దర్శనానికి రావాలని ఆయన కోరారు.