యాత్రా స్థలాలు కోటప్పకొండలా ఉండాలి

26-nov-2016

రాష్ట్రంలో ప్రతి యాత్రా స్థలం కోటప్పకొండలా ఉండాలని సినీ నటులు, రచయిత గొల్లపూడి మారుతిరావు అన్నారు. శనివారం సాయత్రం శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుతో కలిసి ఆయన కోటప్పకొండ త్రికోటేశ్వరుని దర్శించుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ గతంలో తాను ఒకటి రెండుసార్లు వచ్చాను గాని ఈసారి చాలా నిశితంగా గమనించానని, భక్తితో పాటు మానసిక ఉల్లాసం కూడా కలిగిందన్నారు. దేవస్థానం ప్రాంతమంతా పరిశుభ్రతకు మారుపేరుగా ఉందన్నారు.

పంచ సహస్రవధాని మేడసాని మోహన్‌ మాట్లాడుతూ మేథోదక్షిణామూర్తిని లింగాకార రూపంలో దర్శనం చేసుకోవటం తనకు పూర్తి సంతృప్తి ఇచ్చిందన్నారు. ఇక్కడ నిర్వహణ తీరు చాలా బాగుందని ప్రశంసించారు. సభాపతి డాక్టర్‌ కోడెల, గొల్లపూడి మారుతిరావు, మేడసాని మోహన్‌ తదితరులు మొదట ఘాట్‌ రోడ్డులోని పర్యావరణ పర్యాటక క్షేత్రాన్ని తిరిగి చూశారు. ఆలయన ప్రతినిధులు వారికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. త్రికోటేశ్వరునికి అర్చన నిర్వహించారు. అర్చకులు మహానంది మంటపంలో ఆశీర్వచనం చేసి శేషవస్త్రాలు, స్వామి వారి జ్ఞాపికలను అతిథులకు అందజేశారు. దేవస్థాన ఈవో డి.శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు.

కార్తీక మాసం నాలుగో సోమవారం

భక్తులు తెల్లవారుజాము నుంచే కొండకు రావడం కనిపించింది. మెట్ల మార్గంలో భక్తులు పూజ చేశారు.స్వామి సన్నిధిలో మర్రిచెట్టు వద్ద మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పుట్టలో పాలుపోసి పూజలు చేశారు.

కిటకిటలాడిన కోటప్పకొండ

కార్తీక మాసం ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామి వారి మూలవిరాట్‌కు విరివిగా అభిషేకాలు జరిగాయి. నాగేంద్రునడి పుట్ట, ధ్యానశివుడి విగ్రహం వద్ద కూడా విశేష పూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించారు.

కిటకిటలాడిన కోటప్పకొండ

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని కోటప్పకొండపై ఉన్న త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. కార్తీక పౌర్ణమి, సోమవారం ఒకేరోజు రావటంతో గుంటూరు, ప్రకాశం, తదితర జిల్లాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ చుట్టూ గిరి ప్రదక్షిణలు చేశారు. స్వామి సన్నిధిలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం వెనుక మర్రిచెట్టు కింద లింగాకారానికి, విఘ్నేశ్వరునికి, నాగేంద్రస్వామికి భక్తులు పూజలు నిర్వహించారు. కొండ దిగువున వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు వనభోజనాలు చేశారు.

కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు

కార్తీక పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ గిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. సభాపతి డాక్టర్‌ శివప్రసాదరావు సోమవారం ఉదయం మెట్ల మార్గం వద్ద నుంచి వేలాది మంది భక్తులతో గిరి ప్రదక్షిణకు శ్రీకారం చుడతారన్నారు. ఎనిమిది కిలోమీటర్ల గిరి ప్రదక్షిణలో ఆయన స్వయంగా పాల్గొంటారని శ్రీనివాసరావు చెప్పారు. కోటప్పకొండ గిరి ప్రదక్షిణ అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర శిఖరాలు కారణంగా త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినట్లేనని ఆయన తెలిపారు. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనేది పురాణాలు చెబుతున్నాయన్నారు. ఈసారి కార్తీక సోమవారం నాడే పౌర్ణమి రావడంతో భారీగా హాజరయ్యే అవకాశం ఉన్నందున, కాబట్టి తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామి వారికి అభిషేకాలు ప్రారంభమవుతాయన్నారు. ఘాట్‌రోడ్డులో ఆటోలు, ప్రైవేటు జీపులు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ట్రాక్టర్లను కూడా కొండ కిందే ఆపుకొని భక్తులు స్వామి దర్శనానికి రావాలని ఆయన కోరారు.

కోటప్పకొండ అభివృద్ధిపై ఇంగ్లాండ్‌ బృందం కితాబు

13-nov-2016

కోటప్పకొండ ప్రాంతం పర్యాటక క్షేత్రంగా అద్భుతంగా ఉందని ఇంగ్లాండ్‌కు చెందిన ఎంపీల బృందం తెలిపింది. శుక్రవారం సాయంత్రం ఎంపీలు వీరేంద్రశర్మ, నస్రత్‌ ఘని, దిలార్డు లానా, బ్రిటీష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ యాండ్రు మికిలిస్టర్లు శాసనసభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు నేతృత్వంలో కోటప్పకొండలో పర్యటించారు. సభాపతి వారికి ప్రతి అంశాన్ని వివరిస్తూ కలియదిరిగారు. ఆక్వేరియం చూసి ఎంపీలు ఆనందం వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న మినీ రైలులో కొద్దిసేపు అటవీ ప్రాంతంలో తిరిగి వచ్చారు. అనంతరం ఎంపీల బృందం మాట్లాడుతూ ఇంత చక్కగా పర్యాటక క్షేత్రం అభివృద్ధి చేసిన కోడెలను అభినందిస్తున్నామన్నారు. ఈ క్షేత్రం తమకు ఎంతగానో నచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో సంగం డెయిరీ డైరెక్టర్‌ మక్కెన రామాంజనేయులు, హనుమంతరావు, విశ్వేశ్వరరావు, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.