జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ పర్యాటక క్షేత్రాన్ని దేశస్థాయిలోనే గుర్తింపు పొందేలా లక్ష్యం పెట్టుకున్నామని శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఆయన కోటప్పకొండలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కేంద్రంగా కోటప్పకొండను తయారు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.50 కోట్లు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపబోతున్నట్లు చెప్పారు. యాత్రికులు ఎప్పుడు వచ్చినా కూడా పర్యాటక క్షేత్రం కొత్త అందాలతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గతంతో పోల్చితే ప్రస్తుతం కోటప్పకొండ దట్టమైన అటవీ ప్రాంతంగా తయారైందన్నారు. వన్యప్రాణులను రక్షించేందుకు సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. తి.తి.దే. ఆధ్వర్యంలో నిర్మిస్తున్న యాత్రినివాస్, వేదపాఠశాల భవనాలను కూడా ఆయన పరిశీలించారు. త్వరలో వీటిని ప్రారంభిస్తామని కోడెల చెప్పారు. ఘాట్ రోడ్డులో దాదాపు ఎక్కువ శాతం నడిచి తిరిగారు.