జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలోని ఈనెల 9న గురువారం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో డి.శ్రీనివాసరావు తెలిపారు. జ్ఞానప్రదాతగా భక్తుల నీరాజనాలు అందుకునే శ్రీమేధాదక్షిణామూర్తి స్వామి కరుణా కటాక్షాలు చిన్నారులకు ఉండాలనే తలంపుతో ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, శ్రీమేధాదక్షిణామూర్తి పూజ, గణపతి హోమం నిర్వహిస్తామని వెల్లడించారు. అక్షరాభ్యాసాలు చేయించుకునే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి రూపు, కంకణం అందచేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి పూజా సామగ్రి దేవస్థానమే అందచేస్తుందని వివరించారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.