సమష్టి సహకారంతో కోటప్పకొండ తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించినట్లు నరసరావుపేట డీఎస్పీ కొమ్మనబోయిన నాగేశ్వరరావు అన్నారు. చిలకలూరిపేట నూతన అర్బన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం రాత్రి కోటప్పకొండ తిరునాళ్ల విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తులు, ప్రభల నిర్వాహకులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరి సహకారం మరచి పోలేనిదని కొనియాడారు. గ్రామీణ ఎస్పీ స్వతహాగా ఇంజినీర్ కావడంతో ఈ ఏడాది ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేసి వాహనాలను సజావుగా మళ్లించ గలిగామని చెప్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట అర్బన్, రూరల్ సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకుని బందోబస్తు నిర్వహించారని కొనియాడారు.
ప్రభ నిర్వాహకులు పోలీసుల సూచనలు కచ్చితంగా పాటించబట్టే ఇబ్బంది కలగలేదని అభినందనలు తెలిపారు. గతంలో తాను తిరునాళ్లకు వచ్చిన సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఏర్పాట్లు చేశామన్నారు. పలువురు ప్రభల నిర్వాహకులు మాట్లాడారు. కార్యక్రమంలో పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీఈ రవికుమార్, చిలకలూరిపేట గ్రామీణ సీఐ దిలీప్‌కుమార్, అర్బన్ సీఐ బి.సురేష్‌బాబు, వినుకొండ గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, నరసరావుపేట ఒన్‌టౌన్, టూటౌన్, రూరల్ సీఐలు, ఎస్సైలు, యడవల్లి, మద్దిరాల, పురుషోత్తమపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాల ప్రభల నిర్వాహకులు పాల్గొన్నారు.