కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి తిరునాళ్ల సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు కృషి, అధికారుల సహకారంతో విజయవంతమైందని దేవస్థాన పాలక మండలి సభ్యులు అనుమోలు వెంకయ్యచౌదరి, కొత్తూరి రామసుబ్బారాయుడు, చెరుకూరి ప్రసాద్ తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక రాజాగారికోటలోని తెదేపా కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరునాళ్లకు నీరు రావేమో అన్న ఆందోళన ఉండగా సభాపతి ప్రయత్నంతో నీరు రావటం భక్తులకు ఆనందాన్ని కలిగించిందన్నారు. కోటప్పకొండ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈసారి గతేడాది కంటే రూ.12 లక్షలు అధికంగా స్వామి వారికి ఆదాయం లభించినట్లు వివరించారు. 12న చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం కోటప్పకొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీత్రికోటేశ్వర వైభవం, శ్రీమేధా దక్షిణామూర్తి తత్త్వం, అక్షరాభ్యాస ఫలితం అనే అంశాలపై ఆయన ప్రసంగం చేస్తారన్నారు. 20న కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.