సుప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రాల్లో భూకైలాసంగా, దక్షిణ కాశీగా పేరొందిన పరమ పావన పుణ్యక్షేత్రం కోటప్పకొండ. శ్రీమేథా దక్షిణామూర్తి అవతార రూపమే కొండ పైన వేంచేసిన త్రికోటేశ్వర స్వామి. దక్షయజ్ఞం విధ్వంసం తరవాత మహాదేవుడు బ్రహ్మచారిగా, చిరుప్రాయపు వతువుగా, ధ్యాన శంకరుడిగా శ్రీమేథా దక్షిణామూర్తి రూపంతో ఇక్కడ వెలిశారనేది స్థల పురాణం. దేవతలకు, మహర్షులకు భక్తులకు, ఎందరో మహానుభావులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఘాట్ రోడ్డు లేని రోజుల్లో నరసరావుపేట జమిందార్ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయించారు. చరిత్రాత్మకంగా క్రీ.శ. 1172 నాటికే త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కుళొత్తుంగ చోళరాజు, సామంతులు మురాంగి నాయకుడు వేయించిన దాన శాసనాలు తెలియజేస్తున్నాయి. సిద్ధమల్లప్ప, శుంభుమల్లమ్మ తదితర భక్తులు వేయించిన శాసనాల వల్ల ఆలయ ప్రాచీనత కూడా వెలుగు చూసింది. త్రికోటేశ్వరునికి శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం ప్రాంత జమిందార్లు భూములు సమర్పించారు. భక్తులైన సాలంకుడు అతని ముగ్గురు సోదరులు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగ స్వరూపులు కావటం, ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధాన మందడం క్షేత్ర వైశిష్టం. మహాశివరాత్రి నాడు జరిగే తిరునాళ్లలో కోటప్ప తిరునాళ్లగా ప్రసిద్ధి పొందింది.
పల్నాట ప్రజలకు ఎనలేని భక్తిభావం
రాష్ట్రంలో కోటప్పకొండ తిరునాళ్ల ప్రసిద్ధి చెందింది. పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కడెక్కడో నివసించే వారంతా కోటప్పకొండకు తప్పనిసరిగా వస్తారు. భక్తజనులకు సులువుగా దర్శనమిచ్చే మూర్తిగా త్రికోటేశ్వరుడు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని భక్తిభావం. పంటలు బాగా పండాలని, పిల్లా జల్లా చల్లగా ఉండాలని ఇక్కడి వారంతా ఆయన్ను కోరుకుంటారు. తాము అనుకున్నవన్నీ నెరవేరితే శివరాత్రి నాటికి ప్రభ కట్టుకొని కొండకు వస్తామని మొక్కుకుంటారు. ఇది భక్తుల మనోభావం. ఎన్ని లక్షలైనా ఖర్చుచేసి ప్రభలు కట్టుకొని ఎంత శ్రమ అయినా వెనుదీయక కోటప్పకొండకు చేరుతారు. ఒక్క రోజు పండగ అయినప్పటికీ ఎంత శ్రమ అయినా సరే వెనుకాడని భక్త జనం త్రికోటేశ్వరునికి ఉన్నారు.
కల్యాణం, ధ్వజ స్తంభం ఉండవు
త్రికోటేశ్వరుని దేవస్థానానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు దక్ష యజ్ఞం చేసిన తరవాత వచ్చి కోటప్పకొండను ఎంచుకొని ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇక్కడ అమ్మవారు ఉండరు. అందువల్ల స్వామివారికి కల్యాణం ఉండదు. అదేవిధంగా ధ్వజస్తంభం కూడా ఉండదు. చాలా మందికి ఈ విషయం తెలీదు. స్వామివారికి అనునిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు, ఆ తరవాత పంచ హారతులు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్చన తదితర పూజలు ఉంటాయి.