సమష్టి సహకారంతో ప్రశాంతంగా కోటప్పకొండ తిరునాళ్ల

సమష్టి సహకారంతో కోటప్పకొండ తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించినట్లు నరసరావుపేట డీఎస్పీ కొమ్మనబోయిన నాగేశ్వరరావు అన్నారు. చిలకలూరిపేట నూతన అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో బుధవారం రాత్రి కోటప్పకొండ తిరునాళ్ల విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తులు, ప్రభల నిర్వాహకులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరి సహకారం మరచి పోలేనిదని కొనియాడారు. గ్రామీణ ఎస్పీ స్వతహాగా ఇంజినీర్‌ కావడంతో ఈ ఏడాది ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేసి వాహనాలను సజావుగా మళ్లించ గలిగామని చెప్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట అర్బన్‌, రూరల్‌ సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకుని బందోబస్తు నిర్వహించారని కొనియాడారు. 

ప్రభ నిర్వాహకులు పోలీసుల సూచనలు కచ్చితంగా పాటించబట్టే ఇబ్బంది కలగలేదని అభినందనలు తెలిపారు. గతంలో తాను తిరునాళ్లకు వచ్చిన సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఏర్పాట్లు చేశామన్నారు. పలువురు ప్రభల నిర్వాహకులు మాట్లాడారు. కార్యక్రమంలో పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీఈ రవికుమార్‌, చిలకలూరిపేట గ్రామీణ సీఐ దిలీప్‌కుమార్‌, అర్బన్‌ సీఐ బి.సురేష్‌బాబు, వినుకొండ గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, నరసరావుపేట ఒన్‌టౌన్‌, టూటౌన్‌, రూరల్‌ సీఐలు, ఎస్సైలు, యడవల్లి, మద్దిరాల, పురుషోత్తమపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాల ప్రభల నిర్వాహకులు పాల్గొన్నారు. 

‘సభాపతి కృషితో తిరునాళ్ల విజయవంతం’

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి తిరునాళ్ల సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు కృషి, అధికారుల సహకారంతో విజయవంతమైందని దేవస్థాన పాలక మండలి సభ్యులు అనుమోలు వెంకయ్యచౌదరి, కొత్తూరి రామసుబ్బారాయుడు, చెరుకూరి ప్రసాద్‌ తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక రాజాగారికోటలోని తెదేపా కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరునాళ్లకు నీరు రావేమో అన్న ఆందోళన ఉండగా సభాపతి ప్రయత్నంతో నీరు రావటం భక్తులకు ఆనందాన్ని కలిగించిందన్నారు. కోటప్పకొండ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈసారి గతేడాది కంటే రూ.12 లక్షలు అధికంగా స్వామి వారికి ఆదాయం లభించినట్లు వివరించారు. 12న చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం కోటప్పకొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీత్రికోటేశ్వర వైభవం, శ్రీమేధా దక్షిణామూర్తి తత్త్వం, అక్షరాభ్యాస ఫలితం అనే అంశాలపై ఆయన ప్రసంగం చేస్తారన్నారు. 20న కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

త్రికోటేశ్వరుని ఆదాయం రూ.కోటి 9 లక్షలు

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి రూ.1,09,07,228 ఆదాయం లభించింది. గతేడాది కన్నా రూ.12 లక్షలు పైచిలుకు అదనంగా ఆదాయం లభించినట్లు దేవస్థాన సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు తెలిపారు. దర్శనం టికెట్ల ద్వారా రూ.38,22,565, హుండీ రూ.43,42,665, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.26,53,460, విరాళాలు, స్కీమ్‌ల ద్వారా రూ.88,561, 10 గ్రాములు బంగారం, 605 గ్రాముల వెండి లభించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రాక తక్కువేనని భావిస్తున్నప్పటికీ స్వామివారి ఆదాయం పెరగటం విశేషం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి త్రికోటేశ్వరుని తిరునాళ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సహాయ కమిషనర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

త్రిశూలధారి త్రిలోకపాలి

సుప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రాల్లో భూకైలాసంగా, దక్షిణ కాశీగా పేరొందిన పరమ పావన పుణ్యక్షేత్రం కోటప్పకొండ. శ్రీమేథా దక్షిణామూర్తి అవతార రూపమే కొండ పైన వేంచేసిన త్రికోటేశ్వర స్వామి. దక్షయజ్ఞం విధ్వంసం తరవాత మహాదేవుడు బ్రహ్మచారిగా, చిరుప్రాయపు వతువుగా, ధ్యాన శంకరుడిగా శ్రీమేథా దక్షిణామూర్తి రూపంతో ఇక్కడ వెలిశారనేది స్థల పురాణం. దేవతలకు, మహర్షులకు భక్తులకు, ఎందరో మహానుభావులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఘాట్‌ రోడ్డు లేని రోజుల్లో నరసరావుపేట జమిందార్‌ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయించారు. చరిత్రాత్మకంగా క్రీ.శ. 1172 నాటికే త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కుళొత్తుంగ చోళరాజు, సామంతులు మురాంగి నాయకుడు వేయించిన దాన శాసనాలు తెలియజేస్తున్నాయి. సిద్ధమల్లప్ప, శుంభుమల్లమ్మ తదితర భక్తులు వేయించిన శాసనాల వల్ల ఆలయ ప్రాచీనత కూడా వెలుగు చూసింది. త్రికోటేశ్వరునికి శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం ప్రాంత జమిందార్లు భూములు సమర్పించారు. భక్తులైన సాలంకుడు అతని ముగ్గురు సోదరులు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగ స్వరూపులు కావటం, ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధాన మందడం క్షేత్ర వైశిష్టం. మహాశివరాత్రి నాడు జరిగే తిరునాళ్లలో కోటప్ప తిరునాళ్లగా ప్రసిద్ధి పొందింది. 

పల్నాట ప్రజలకు ఎనలేని భక్తిభావం
రాష్ట్రంలో కోటప్పకొండ తిరునాళ్ల ప్రసిద్ధి చెందింది. పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కడెక్కడో నివసించే వారంతా కోటప్పకొండకు తప్పనిసరిగా వస్తారు. భక్తజనులకు సులువుగా దర్శనమిచ్చే మూర్తిగా త్రికోటేశ్వరుడు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని భక్తిభావం. పంటలు బాగా పండాలని, పిల్లా జల్లా చల్లగా ఉండాలని ఇక్కడి వారంతా ఆయన్ను కోరుకుంటారు. తాము అనుకున్నవన్నీ నెరవేరితే శివరాత్రి నాటికి ప్రభ కట్టుకొని కొండకు వస్తామని మొక్కుకుంటారు. ఇది భక్తుల మనోభావం. ఎన్ని లక్షలైనా ఖర్చుచేసి ప్రభలు కట్టుకొని ఎంత శ్రమ అయినా వెనుదీయక కోటప్పకొండకు చేరుతారు. ఒక్క రోజు పండగ అయినప్పటికీ ఎంత శ్రమ అయినా సరే వెనుకాడని భక్త జనం త్రికోటేశ్వరునికి ఉన్నారు.

కల్యాణం, ధ్వజ స్తంభం ఉండవు
త్రికోటేశ్వరుని దేవస్థానానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు దక్ష యజ్ఞం చేసిన తరవాత వచ్చి కోటప్పకొండను ఎంచుకొని ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇక్కడ అమ్మవారు ఉండరు. అందువల్ల స్వామివారికి కల్యాణం ఉండదు. అదేవిధంగా ధ్వజస్తంభం కూడా ఉండదు. చాలా మందికి ఈ విషయం తెలీదు. స్వామివారికి అనునిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు, ఆ తరవాత పంచ హారతులు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్చన తదితర పూజలు ఉంటాయి.

ప్రభకు ఎల్‌ఈడీ తళుకులు

ప్రభల ఏర్పాటులో ముందుండే చిలకలూరిపేట ప్రాంతం ఈసారి మరో ప్రత్యేకతను కూడా చాటుకుంది. అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామానికి చెందిన పున్నారావు 60 అడుగుల విద్యుత్తు ప్రభను తయారు చేసి ప్రదర్శించారు. ప్రభకు ఏర్పాటు చేసే తడిక వరకు ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. మిగతా సెట్టింగ్‌ మొత్తం పెద్ద ప్రభకు ఉన్నట్లుగానే ఉంటాయని పున్నారావు తెలిపారు.