కోటప్పకొండ తిరునాళ్ల సమయం దగ్గర పడుతుండటంతో ఏటా క్రమం తప్పకుండా ప్రభలు కడుతున్న మద్దిరాల, యడవల్లి, పురుషోత్తంపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాల్లో ప్రభల పనులు చకచకా చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పొడుగు సరివి బారులను వరుసక్రమంలో తాళ్లతో ముడులు వేస్తూ కట్టేపనిలో నిమగ్నమయ్యారు. మద్దిరాల గ్రామస్థులు ఈ ఏడాది ప్రత్యేకంగా ఇనుముతో ప్రభకోసం బండిని తయారు చేశారు. ఐదేళ్ల నుంచి వరుసగా ప్రభను నిర్మిస్తున్న యడవల్లి తెలుగు యువత ఈసారి కూడా 95 అడుగుల ఎత్తులో ప్రభను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ప్రభల నిర్మాణ పనుల్లో ప్రజలు పాల్గొంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది.