పల్లెల్లో ప్రభల పనుల సందడి

కోటప్పకొండ తిరునాళ్ల సమయం దగ్గర పడుతుండటంతో ఏటా క్రమం తప్పకుండా ప్రభలు కడుతున్న మద్దిరాల, యడవల్లి, పురుషోత్తంపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాల్లో ప్రభల పనులు చకచకా చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పొడుగు సరివి బారులను వరుసక్రమంలో తాళ్లతో ముడులు వేస్తూ కట్టేపనిలో నిమగ్నమయ్యారు. మద్దిరాల గ్రామస్థులు ఈ ఏడాది ప్రత్యేకంగా ఇనుముతో ప్రభకోసం బండిని తయారు చేశారు. ఐదేళ్ల నుంచి వరుసగా ప్రభను నిర్మిస్తున్న యడవల్లి తెలుగు యువత ఈసారి కూడా 95 అడుగుల ఎత్తులో ప్రభను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ప్రభల నిర్మాణ పనుల్లో ప్రజలు పాల్గొంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది.

22-feb-2016

కోటప్పకొండ ధర్మకర్తల మండలి నియామకం

జిల్లాలో ప్రసిద్ధి చెందిన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశపారంపర్య ధర్మకర్త ఎంవీఆర్‌ కొండలరావు, చెరుకూరి ప్రసాద్‌, గుడిపూడి నాగభూషణం, అనుమోలు వెంకయ్య చౌదరి, బెల్లంకొండ పిచ్చయ్య, కొర్నెపాటి సుబ్బారావు, మండవ లీలా వెంకట శ్రీనివాసరావు, రమణపాటి భాగ్యలక్ష్మి, కొత్తూరి రామసుబ్బరాయుడు, ఎక్స్‌అఫీషియో సభ్యునిగా ముఖ్యఅర్చకుడు ఆర్‌.కిరణ్‌కిశోర్‌ శర్మను నియమించారు. వీరి పదవీకాలం రెండేళ్ల పాటు ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించి నాటి నుంచి కాలపరిమితి వర్తిస్తుందని ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ ఆదేశాలు జారీ చేశారు.