volume_ii-project-information-memorandum-for-ropeway-at-kotappakonda_f
ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రం కోటప్పకొండలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పర్యాటక శాఖాపరంగా చేయటానికి రూ.3.5కోట్లతో తాజాగా టెండర్లు పిలిచారు. కోటప్పకొండను అద్భుతంగా తయారు చేయాలన్న లక్ష్యంతో శాసన సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. పర్యాటక శాఖాధికారులను పలుమార్లు కొండకు పిలిపించి స్వయంగా చూపించారు. ఈ నేపథ్యంలో కొండ కింద నుంచి పైకి రోప్‌వే(తీగమార్గం) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఆశాఖాధికారులు తీగమార్గం ఏర్పాటు చేయటానికి స్థలాన్ని పరిశీలించి వెళ్లారు. రూ.7కోట్ల నిధులు దీని కోసం ఖర్చు చేయబోతున్నారు. పీపీపీ విధానంలో దీనిని ఏర్పాటు చేస్తారు. మరోవైపు కొండ కింద పైన అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచారు.
కొండ కింద విశ్రాంతి గదుల భవన సముదాయం, ఫ¾లహారశాల, ఫుడ్‌కోర్డు ఏర్పాటు చేస్తారు. కొండపైన తీగమార్గంలో దిగే ప్రయాణికుల విశ్రాంతి కోసం పెద్దభవనాన్ని నిర్మించబోతున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పర్యాటక క్షేత్రాన్ని విస్తరింప చేస్తున్నారు. మరోవైపు కొండపైకి వచ్చే యాత్రికుల అవసరాల కోసం దేవస్థానం ఆధ్వర్యంలో 2 లక్షల నీటి నిల్వ సామర్థ్యంతో సంపు, పైపులైను నిర్మాణానికి రూ.28లక్షల నిధులు వ్యయం చేయబోతున్నారు. భక్తులకు మహాశివరాత్రి నాడే కాకుండా వేసవిలో తాగు నీటికి ఇబ్బంది లేకుండా చేస్తారు. మరో వైపు దేవస్థానం ముఖమండపం ఎదురుగా ఉన్న త్రిముఖ లింగాకారాన్ని తొలగించి స్థలాన్ని విస్తరించాలని నిర్ణయించారు. స్థలవిస్తరణ తర్వాత మళ్లీ త్రిముఖలింగాకారాన్ని మరలా నిర్మిస్తారు.గొల్లభామ దేవస్థానం వద్ద నుంచి సరాసరి పైకి మెట్లు కూడా నిర్మించాలని ఆలోచన చేస్తున్నారు. దీని రూ.1.20కోట్ల నిధులు వ్యయమవుతాయని అంచనా. ఆదివారం సాంకేతిక నిపుణులు పరిశీలన చేశారు. పర్యాటకశాఖ, భవనాలన్నీ మార్చి 31 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు. తితిదే ఆధ్వర్యంలో వేదపాఠశాల యాత్రికుల విశ్రాంతి భవనం నిర్మాణం పనులు సాగుతున్నాయి.