Kotappakonda |

నేడు త్రికోటేశ్వరుని సన్నిధిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు

జిల్లాలో ప్రముఖ శైవక్షేత్రమైన కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి సన్నిధిలోని ఈనెల 9న గురువారం ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో డి.శ్రీనివాసరావు తెలిపారు. జ్ఞానప్రదాతగా భక్తుల నీరాజనాలు అందుకునే శ్రీమేధాదక్షిణామూర్తి స్వామి కరుణా కటాక్షాలు చిన్నారులకు ఉండాలనే తలంపుతో ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, శ్రీమేధాదక్షిణామూర్తి పూజ, గణపతి హోమం నిర్వహిస్తామని వెల్లడించారు. అక్షరాభ్యాసాలు చేయించుకునే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి రూపు, కంకణం అందచేస్తామన్నారు. ప్రతి ఒక్కరికి పూజా సామగ్రి దేవస్థానమే అందచేస్తుందని వివరించారు. భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

9న త్రికోటేశ్వరుని సన్నిధిలో ఉచిత సామూహిక అక్షరాభ్యాసాలు

జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల 9న ఉచిత సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో డి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. జ్ఞానప్రదాత శ్రీమేధాదక్షిణామూర్తి స్వామి కరుణ కటాక్షాలు చిన్నారులకు ఇప్పించాలన్న తలంపుతో ఉచితంగా అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహావాచనం, రక్షాబంధనం, శ్రీమేధాదక్షిణామూర్తి పూజ, గణపతి హోమం, మేధాదక్షిణామూర్తి హోమం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అక్షరాభ్యాసాలు చేయించుకునే చిన్నారులకు పలక, బలపం, సరస్వతి రూపు, కంకణం అందజేస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి పూజ సామగ్రి దేవస్థానమే అందజేస్తుందని వివరించారు.

కోటప్పకొండ పర్యావరణ కేంద్రం అభివృద్ధికి కృషి

రానున్న ఐదేళ్లలో కోటప్పకొండ ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని వందశాతం అభివృద్ధి పరచనున్నట్టు అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పారు. శుక్రవారం ఆయన ప్రకృతి పర్యావరణ కేంద్రాన్ని సందర్శించారు.   అధికారులతో సమీక్షించారు. డీఎఫ్‌వో మోహనరావు, ఫారెస్ట్ రేంజర్ హరి, కాంట్రాక్టర్ సుధీర్‌తో కలసి పర్యావరణ కేంద్రం��ో పర్యటించారు. నూతనంగా నిర్మిస్తున్న ఎన్‌క్లోజర్లను పరిశీలించారు.  కృష్ణజింక, ముళ్లపంది, సాంబర్(దుప్పిజాతి)తో పాటు పలు రకాల పక్షుల జాతులను వైజాగ్ జూ నుంచి తీసుకురానున్న నేపథ్యంలో వాటిని ఎక్కడెక్కడ ఎన్‌క్లోజర్‌లలో ఉంచాలనేదానిపై పరిశీలన జరిపారు.

అలాగే ట్రాయ్ ట్రైన్ ఇప్పటి వరకు పర్యావరణ కేంద్రంలో అరకిలోమీటర్ వరకు ప్రయాణిస్తోంది. దీనిని కిలోమీటర్‌కు పెంచాలని నిర్ణయించారు. ట్రాయ్‌ట్రైన్ తిరిగే ప్రాంతంలో ఏర్పడిన గుంతలను రోలింగ్ చేయించి పూడ్చాలని ఆదేశించారు. పర్యావరణ కేంద్రంలో అభివృద్ధి నిరంతరం కొనసాగాలన్నారు.

నెమళ్లను ఆరుబయటకు వదిలితే సందర్శకులను ఆకట్టుకుంటాయని చెప్పారు.  కుందేళ్ల ఎన్‌క్లోజర్ వద్దకు కొండచిలువ రావడాన్ని అధికారులు ప్రస్తావించగా, జాగ్రత్తలు తీసుకోవాలని సభాపతి సూచించారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డ్ చైర్మన్ కడియాల రమేష్, తహసీల్దార్ లీలాసంజీవకుమారి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బద్దూ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన

వైశాఖ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన కార్యక్రమాన్ని శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభమైన పూజ 8 గంటలకు ముగిసింది. దేవస్థాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య మల్లెపూలతో చేసిన అర్చన భక్తజనులను పులకింప చేసింది. అనంతరం స్వామి వారికి నైవేద్యం, మంగళ హారతి సమర్పించారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మల్లెపూలను దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి, వెంకటేశ్వరరెడ్డి సమర్పించగా మరో సభ్యుడు బెల్లంకొండ పిచ్చయ్య భక్తులకు విస్సనకర్రలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు. ప్రసాదాలను ముక్కు వెంకటేశ్వరరెడ్డి అందజేశారు. దేవస్థాన ఉద్యోగులు దగ్గరుండి ప్రసాదాలను భక్తులకు అందేలా చూశారు. వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన

వైశాఖ పౌర్ణమి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి లక్ష మల్లెలతో అర్చన కార్యక్రమాన్ని శనివారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. రాత్రి ఆరు గంటలకు ప్రారంభమైన పూజ 8 గంటలకు ముగిసింది. దేవస్థాన అర్చకుల వేదమంత్రోచ్ఛరణల మధ్య మల్లెపూలతో చేసిన అర్చన భక్తజనులను పులకింప చేసింది. అనంతరం స్వామి వారికి నైవేద్యం, మంగళ హారతి సమర్పించారు. దేవస్థాన కార్యనిర్వాహణాధికారి డి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. మల్లెపూలను దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యుడు అనుమోలు వెంకయ్య చౌదరి, వెంకటేశ్వరరెడ్డి సమర్పించగా మరో సభ్యుడు బెల్లంకొండ పిచ్చయ్య భక్తులకు విస్సనకర్రలు, మామిడి పండ్లు పంపిణీ చేశారు. ప్రసాదాలను ముక్కు వెంకటేశ్వరరెడ్డి అందజేశారు. దేవస్థాన ఉద్యోగులు దగ్గరుండి ప్రసాదాలను భక్తులకు అందేలా చూశారు. వంశపారంపర్య ధర్మకర్త కుటుంబ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

త్రికోటేశ్వరుని సన్నిధిలో మంత్రి శిద్దా

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఆదివారం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం ఆయన స్వామి దర్శనానికి విచ్చేశారు. ఆలయ మర్యాదలతో అర్చకులు దేవస్థాన ఉద్యోగులు ధర్మకర్తల మండలి సభ్యులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రాఘవరావు స్వామి వారికి అభిషేకం చేయించారు. కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు అనుమోలు వెంకయ్య, బెల్లంకొండ పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

సమష్టి సహకారంతో ప్రశాంతంగా కోటప్పకొండ తిరునాళ్ల

సమష్టి సహకారంతో కోటప్పకొండ తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించినట్లు నరసరావుపేట డీఎస్పీ కొమ్మనబోయిన నాగేశ్వరరావు అన్నారు. చిలకలూరిపేట నూతన అర్బన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఆవరణలో బుధవారం రాత్రి కోటప్పకొండ తిరునాళ్ల విజయోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. భక్తులు, ప్రభల నిర్వాహకులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు అందరి సహకారం మరచి పోలేనిదని కొనియాడారు. గ్రామీణ ఎస్పీ స్వతహాగా ఇంజినీర్‌ కావడంతో ఈ ఏడాది ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా తాత్కాలిక రహదారులు ఏర్పాటు చేసి వాహనాలను సజావుగా మళ్లించ గలిగామని చెప్పారు. నరసరావుపేట, చిలకలూరిపేట అర్బన్‌, రూరల్‌ సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకుని బందోబస్తు నిర్వహించారని కొనియాడారు.

ప్రభ నిర్వాహకులు పోలీసుల సూచనలు కచ్చితంగా పాటించబట్టే ఇబ్బంది కలగలేదని అభినందనలు తెలిపారు. గతంలో తాను తిరునాళ్లకు వచ్చిన సమయంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తుల నుంచి వీఐపీల వరకు ఎవరూ ఇబ్బంది పడకూడదని ఏర్పాట్లు చేశామన్నారు. పలువురు ప్రభల నిర్వాహకులు మాట్లాడారు. కార్యక్రమంలో పోలీసు గృహ నిర్మాణ సంస్థ డీఈ రవికుమార్‌, చిలకలూరిపేట గ్రామీణ సీఐ దిలీప్‌కుమార్‌, అర్బన్‌ సీఐ బి.సురేష్‌బాబు, వినుకొండ గ్రామీణ సీఐ శ్రీనివాసరావు, నరసరావుపేట ఒన్‌టౌన్‌, టూటౌన్‌, రూ���ల్‌ సీఐలు, ఎస్సైలు, యడవల్లి, మద్దిరాల, పురుషోత్తమపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాల ప్రభల నిర్వాహకులు పాల్గొన్నారు.

‘సభాపతి కృషితో తిరునాళ్ల విజయవంతం’

కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి తిరునాళ్ల సభాపతి డాక్టరు కోడెల శివప్రసాదరావు కృషి, అధికారుల సహకారంతో విజయవంతమైందని దేవస్థాన పాలక మండలి సభ్యులు అనుమోలు వెంకయ్యచౌదరి, కొత్తూరి రామసుబ్బారాయుడు, చెరుకూరి ప్రసాద్‌ తెలిపారు. వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక రాజాగారికోటలోని తెదేపా కార్యాలయంలో బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరునాళ్లకు నీరు రావేమో అన్న ఆందోళన ఉండగా సభాపతి ప్రయత్నంతో నీరు రావటం భక్తులకు ఆనందాన్ని కలిగించిందన్నారు. కోటప్పకొండ ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి సాధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈసారి గతేడాది కంటే రూ.12 లక్షలు అధికంగా స్వామి వారికి ఆదాయం లభించినట్లు వివరించారు. 12న చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం కోటప్పకొండలో నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీత్రికోటేశ్వర వైభవం, శ్రీమేధా దక్షిణామూర్తి తత్త్వం, అక్షరాభ్యాస ఫలితం అనే అంశాలపై ఆయన ప్రసంగం చేస్తారన్నారు. 20న కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో తితిదే ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

త్రికోటేశ్వరుని ఆదాయం రూ.కోటి 9 లక్షలు

మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరునికి రూ.1,09,07,228 ఆదాయం లభించింది. గతేడాది కన్నా రూ.12 లక్షలు పైచిలుకు అదనంగా ఆదాయం లభించినట్లు దేవస్థాన సహాయ కమిషనర్‌ డి.శ్రీనివాసరావు తెలిపారు. దర్శనం టికెట్ల ద్వారా రూ.38,22,565, హుండీ రూ.43,42,665, ప్రసాదాల అమ్మకాల ద్వారా రూ.26,53,460, విరాళాలు, స్కీమ్‌ల ద్వారా రూ.88,561, 10 గ్రాములు బంగారం, 605 గ్రాముల వెండి లభించాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రాక తక్కువేనని భావిస్తున్నప్పటికీ స్వామివారి ఆదాయం పెరగటం విశేషం. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి త్రికోటేశ్వరుని తిరునాళ్ల కార్యక్రమాన్ని విజయవంతం చేశారని సహాయ కమిషనర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

వైభవంగా లింగోద్భవ అభిషేకాలు

మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండలో వేంచేసిన త్రికోటేశ్వరునికి సోమవారం రాత్రి వైభవంగా లింగోద్భవ అభిషేకాలు నిర్వహించారు. గణపతి పూజ, మహన్యాసం పూజల్లో వంశపారంపర్వ ధర్మకర్త రామకృష్ణ కొండలరావు దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు, జిల్లా గ్రామీణ ఎస్పీ నారాయణ నాయక్‌, డాక్టర్‌ కోడెల శివరామ్‌ దంపతులు అభిషేకాల్లో పాల్గొన్నారు. జలం, భస్మం, గంధం, సుగంధ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, పళ్ల రసాలు, సుష్కఫలాలు, పసుపు, కుంకుమ తదితర ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు చేశారు. తెల్లవారుజామున మూడు గంటలకు అభిషేకాలు పూర్తయ్యాయి. అనంతరం స్వామికి సంపూర్ణంగా అలంకారం చేశారు. లింగోద్భవ అభిషేకాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అయితే, అందర్నీ లోపలికి అనుమతించటం సాధ్యపడలేదు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి డి.శ్రీనివాసరావు పర్యవేక్షించారు. అభిషేకాలకు ముందు సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు పట్టువస్త్రాలు సమర్పించి వెళ్లారు.

జనసంద్రంగా కోటప్పకొండ

మహాశివరాత్రి సందర్భంగా  త్రికోటేశ్వరుడికి విశేష పూజలు
  
ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండ సోమవారం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి సందర్భంగా ఆలయ పరిసరాలు శివ నామ స్మరణతో మారుమోగాయి. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివచ్చి త్రికోటేశ్వరుడిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. తొలుత బిందతీర్దంతో అభిషేకాలను ఆలయ అర్చకులు నిర్వహించారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. సాలంకయ్య అభిషేక మండపంలో ప్రత్యేక అభిషేకాలు పెద్ద సంఖ్యలో జరిగాయి, యాగశాలలో చండీ, రుద్ర, గణపతి యాగాలు నిర్వహించారు. ధ్యాన శివుడు, నాగేంద్రుడి పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. నూతనంగా నిర్మించిన ప్రసాదం కౌంటర్ వద్ద భక్తుల రద్దీ కనిపించింది. పలువురు భక్తులు మెట్లకు పూజ చేస్తూ కొండకు చేరుకున్నారు. గొల్లభామ గుడి కూడా భక్తులతో నిండిపోయింది. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచిత ప్రసాదాలు, తాగు నీరు పంపిణీ చేశాయి.

 ప్రముఖుల రాక..
స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వారిలో సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, రాష్ర్ట మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు, పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, సినీ హీరో శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. హీరో శ్రీకాంత్‌తో కరచాలనం చేసేందుకు భక్తులు పోటీపడ్డారు.

ఓం నమఃశివాయ

మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధికి భక్తజనులు పోటెత్తారు. ఉదయం నుంచి భక్తుల రాక ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి కొండ జనసంద్రమైంది. సాయంత్రానికి దేవస్థాన ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కిటకిటలాడింది. హర హర చేదుకో కోటయ్యా... మమ్ము ఆదుకోవయ్యా అంటూ శివనామస్మరణతో కొండ హోరెత్తింది. ఉదయం నుంచి ప్రైవేటు వాహనాలను కొండ పైకి అనుమతించలేదు. వీఐపీ పాసులున్న వాహనాలను ఘాట్‌ రోడ్డు వరకే అనుమతించారు. అక్కడి నుంచి వీఐపీలకు ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో కొండ పైకి తరలించారు. స్వామి దర్శనం అనంతరం తిరిగి కొండ కిందకు తీసుకొచ్చారు. సభాపతి కోడెల శివప్రసాదరావుతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బస్సుల్లోనే కొండ పైకి వచ్చారు. ఘాట్‌ రోడ్డులో ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ కాకూడదనేది ఈ విధాన లక్ష్యమైనప్పటికీ బస్సులు మరమ్మతులకు గురైన కారణంగా అప్పుడప్పుడు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. మధ్యాహ్నం వేళ శీఘ్రదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు కొంతసేపు ఖాళీ అయినప్పటికీ ఉచిత దర్శనం ఎడతెరిపి లేకుండా సాగింది.

కొండంత జనం

భక్తులతో కిటకిటలాడిన కోటప్పకొండకు
ప్రత్యేక ఆకర్షణగా విద్యుత్తు ప్రభలు 
గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికోటేశ్వరుని సన్నిధికి కొండంత జనం తరలివచ్చారు.మహాశివరాత్రి పురస్కరించుకుని సోమవారం తెల్లవారు జామున 3గంటలకు స్వామి వారికి అభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రాకతో కోటప్పకొండ జనసంద్రమైంది. క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. ప్రైవేటు వాహనాలు కొండపైకి అనుమతించకపోవడంతో వీఐపీలు సైతం ఆర్టీసీ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బస్సుల్లో ప్రయాణించారు. దీంతో కొండపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సభాపతి కోడెల శివప్రసాద్‌రావు సోమవారం సాయంత్రం స్వామివారికి పట్టువస్త్రాలను వంశపారంపర్య ధర్మకర్త రామకృష్ణకొండలరావు, ఆలయ అధికారులకు అందజేశారు. అంతకుముందు ఆలయ మర్యాదల ప్రకారం మంగళవాయిద్యాలతో సభాపతికి స్వాగతం పలికారు. సాయంత్రానికి భక్తుల రద్దీ పెరగడంతో ఎక్కడ చూసిన జనమే కనిపించారు.

‘ప్రభ’వించిన వెలుగులు : త్రికోటేశ్వరుని మొక్కు తీర్చుకోవడానికి భక్తులు ఏర్పాటుచేసిన ప్రభలు విద్యుత్తు కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాయంత్రం ఆరు గంటల నుంచి కొండ కిందిభాగంలో 14 భారీ ప్రభలు విద్యుత్తు కాంతులతో కనువిందు చేశాయి. తిరునాళ్లలో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చేదుకో... కోటయ్యా అంటూ భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు.

త్రిశూలధారి త్రిలోకపాలి

సుప్రసిద్ధ ప్రాచీన శైవ క్షేత్రాల్లో భూకైలాసంగా, దక్షిణ కాశీగా పేరొందిన పరమ పావన పుణ్యక్షేత్రం కోటప్పకొండ. శ్రీమేథా దక్షిణామూర్తి అవతార రూపమే కొండ పైన వేంచేసిన త్రికోటేశ్వర స్వామి. దక్షయజ్ఞం విధ్వంసం తరవాత మహాదేవుడు బ్రహ్మచారిగా, చిరుప్రాయపు వతువుగా, ధ్యాన శంకరుడిగా శ్రీమేథా దక్షిణామూర్తి రూపంతో ఇక్కడ వెలిశారనేది స్థల పురాణం. దేవతలకు, మహర్షులకు భక్తులకు, ఎందరో మహానుభావులకు బ్రహ్మోపదేశం చేసిన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఘాట్‌ రోడ్డు లేని రోజుల్లో నరసరావుపేట జమిందార్‌ మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేయించారు. చరిత్రాత్మకంగా క్రీ.శ. 1172 నాటికే త్రికోటేశ్వర స్వామి దేవస్థానం ప్రసిద్ధి చెందినట్లు వెలనాటి చోళరాజైన కుళొత్తుంగ చోళరాజు, సామంతులు మురాంగి నాయకుడు వేయించిన దాన శాసనాలు తెలియజేస్తున్నాయి. సిద్ధమల్లప్ప, శుంభుమల్లమ్మ తదితర భక్తులు వేయించిన శాసనాల వల్ల ఆలయ ప్రాచీనత కూడా వెలుగు చూసింది. త్రికోటేశ్వరునికి శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట, చిలకలూరిపేట, అమరావతి, పెట్లూరివారిపాలెం ప్రాంత జమిందార్లు భూములు సమర్పించారు. భక్తులైన సాలంకుడు అతని ముగ్గురు సోదరులు పంచబ్రహ్మ స్థానంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర లింగ స్వరూపులు కావటం, ఆనందవల్లి (గొల్లభామ) శివైక్య సంధాన మందడం క్షేత్ర వైశిష్టం. మహాశివరాత్రి నాడు జరిగే తిరునాళ్లలో కోటప్ప తిరునాళ్లగా ప్రసిద్ధి పొందింది.

పల్నాట ప్రజలకు ఎనలేని భక్తిభావం
రాష్ట్రంలో కోటప్పకొండ తిరునాళ్ల ప్రసిద్ధి చెందింది. పల్నాడు ప్రాంతం నుంచి ఎక్కడెక్కడో నివసించే వారంతా కోటప్పకొండకు తప్పనిసరిగా వస్తారు. భక్తజనులకు సులువుగా దర్శనమిచ్చే మూర్తిగా త్రికోటేశ్వరుడు అంటే ఈ ప్రాంత ప్రజలకు ఎనలేని భక్తిభావం. పంటలు బాగా పండాలని, పిల్లా జల్లా చల్లగా ఉండాలని ఇక్కడి వారంతా ఆయన్ను కోరుకుంటారు. తాము అనుకున్నవన్నీ నెరవేరితే శివరాత్రి నాటికి ప్రభ కట్టుకొని కొండకు వస్తామని మొక్కుకుంటారు. ఇది భక్తుల మనోభావం. ఎన్ని లక్షలైనా ఖర్చుచేసి ప్రభలు కట్టుకొని ఎంత శ్రమ అయినా వెనుదీయక కోటప్పకొండకు చేరుతారు. ఒక్క రోజు పండగ అయినప్పటికీ ఎంత శ్రమ అయినా సరే వెనుకాడని భక్త జనం త్రికోటేశ్వరునికి ఉన్నారు.

కల్యాణం, ధ్వజ స్తంభం ఉండవు
త్రికోటేశ్వరుని దేవస్థానానికి మరో ప్రత్యేకత ఉంది. ఇక్కడ స్వామివారు దక్ష యజ్ఞం చేసిన తరవాత వచ్చి కోటప్పకొండను ఎంచుకొని ధ్యానం చేస్తూ ఉండేవారు. ఇక్కడ అమ్మవారు ఉండరు. అందువల్ల స్వామివారికి కల్యాణం ఉండదు. అదేవిధంగా ధ్వజస్తంభం కూడా ఉండదు. చాలా మందికి ఈ విషయం తెలీదు. స్వామివారికి అనునిత్యం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అభిషేకాలు, ఆ తరవాత పంచ హారతులు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి అర్చన తదితర పూజలు ఉంటాయి.


కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి సందర్భంగా పిడుగురాళ్ల డిపో నుంచి కోటప్పకొండకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజరు ఈ.ఈశ్వరరావు చెప్పారు. శనివారం పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ డిపో నుంచి మొత్తం 37 బస్సులను శైవక్షేత్రాలకు తిప్పుతున్నట్లు తెలిపారు. కోటప్పకొండకు 30, సత్రశాలకు 4, శ్రీశైలానికి 3 తిప్పుతున్నట్లు చెప్పారు. 7న తెల్లవారుజామున 5 నుంచి 8న ఉదయం దాకా బస్సులను నడుపుతామ���్నారు. అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. 10 నుంచి గ్రామాల్లో క్యాట్‌కార్డు మేళాను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 10, 12న కారంపూడిలో, 14న బ్రాహ్మణపల్లి, పిన్నెల్లి, 16న మాచవరం, 18న పిల్లుట్ల, మోర్జంపాడులో, 25న తుమ్మలచెరువు, పెదగార్లపాడు గ్రామాల్లో నిర్వహిస్తామన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ మేనేజరు ట్రాఫిక్‌ ఎ.నాగమణి పాల్గొన్నారు.

ప్రభకు ఎల్‌ఈడీ తళుకులు

ప్రభల ఏర్పాటులో ముందుండే చిలకలూరిపేట ప్రాంతం ఈసారి మరో ప్రత్యేకతను కూడా చాటుకుంది. అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామానికి చెందిన పున్నారావు 60 అడుగుల విద్యుత్తు ప్రభను తయారు చేసి ప్రదర్శించారు. ప్రభకు ఏర్పాటు చేసే తడిక వరకు ఎల్‌ఈడీ బల్బులను అమర్చారు. మిగతా సెట్టింగ్‌ మొత్తం పెద్ద ప్రభకు ఉన్నట్లుగానే ఉంటాయని పున్నారావు తెలిపారు.

4న కోటప్పకొండకు ముఖ్యమంత్రి

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన క్షేత్రంగా కోటప్పకొండను తీర్చిదిద్దుతామని శాసన సభాపతి డాక్టర్‌ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఈ నెల 4వ తేదీ ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోటప్పకొండకు రానున్నారని.. అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం కోటప్పకొండలో సభాపతి కోడెల.. సంయుక్త కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, గ్రామీణ ఎస్‌.పి. నారాయణ నాయక్‌, జె.సి.-2 వెంకటేశ్వరరావు, జిల్లా అటవీ శాఖాధికారి నాగేశ్వరరావు, మత్స్య శాఖ డిప్యూటీ డైరక్టర్‌ బలరాం, ఆర్‌.డి.ఒ. శ్రీనివాసరావులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. తొలుత చిలకలూరిపేట రోడ్డులో హెలిప్యాడ్‌ ఏర్పాటు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. కాపు సత్రం చూశారు. ఆ తర్వాత ఘాట్‌ రోడ్డు మీదుగా వెళ్తూ పర్యావరణ పర్యాటక క్షేత్రంలో చేస్తున్న అభివృద్ధి పనులను, కాళింది మడుగును పరిశీలించారు. కొండ పైన ముఖమండపం ఎదురుగా కొనసాగుతున్న అభివృద్ధి పనులను చూసి అధికారులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏడో తేదీ మహాశివరాత్రి సందర్భంగా చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తిచేయిస్తామని చెప్పారు. కొండకు వచ్చే అన్ని వర్గాలు ఆనందభరితులయ్యే విధంగా అభివృద్ధి ఉంటుందన్నారు. కొండ కింద లేజర్‌ షో, సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ కార్యక్రమాలు చేస్తామన్నారు. రూ.10 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 4న ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నాక స్వామి వారిని దర్శించుకుంటారని తెలిపారు. అనంతరం కొండ కింద జడ్పీ ఉన్నత పాఠశాల వద్ద బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఇ.ఒ. డి.శ్రీనివాసరావు, రోడ్లు భవనాల శాఖ ఇ.ఇ. వెంకటేశ్వరరావు, విద్యుత్తు శాఖ డి.ఇ. ఆంజనేయులు, ఎడిఇ రాంబొట్లు తదితరులు పాల్గొన్నారు.

అశ్లీల నృత్యాలను అనుమతించం: డీఎస్పీ నాగేశ్వరరావు

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండ తిరునాళ్లలో ఏర్పాటు చేసే ప్రభలపై అశ్లీలనృత్యాలకు అనుమతించేది లేదని నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం చిలుకలూరిపేట, నర్సరావుపేట నియోజకవర్గాల్లో ప్రభలుకట్టే నిర్వాహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరునాళ్లు ప్రశాంతంగా జరిగేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభలపై రాజకీయనాయకులు జెండాలు, సినీహీరోల ఫొటోలు పెట్టరాదని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కోటయ్య సన్నిధికి.. కృష్ణమ్మ చేరేనా?

శివరాత్రి తిరునాళ్లకు బుగ్గనీరు 
కొండపైకి పంపింగ్‌తో సరఫరా 
90 కిలోమీటర్ల దూరం ప్రయాణం 
పండగ సమీపించడంతో ఆందోళన 

ఇక కోటయ్యపైనే భారం.. కృష్ణమ్మను రప్పించడం.. భక్తుల గొంతు తడిపే బాధ్యత ఆ దేవదేవుడిదే. నాగార్జునసాగర్‌ జలాశయం నుంచి జలాల విడుదలపై స్పష్టత లేకపోవడంతో కోటప్పకొండ తిరునాళ్ల నీటి అవసరాలు తీర్చేందుకు జలవనరులశాఖ ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. కృష్ణమ్మను పైపులతో ఎత్తిపోసి కోటయ్యకు అభిషేకం చేయాలని నిర్ణయించింది. బుగ్గవాగులో నీటి నిల్వలు అంతంతమాత్రంగానే ఉండడంతో ఇది భగీరథ

ప్రయత్నమే కానుంది. శివరాత్రి పర్వదినం సమీపిస్తుండడం.. సాగర్‌ నుంచి నీటి విడుదల కృష్ణానదీ యాజమాన్య బోర్డు పరిధిలో ఉండటం.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు జలాలు పంచుకోవాల్సి రావడంతో అధికార యంత్రాంగంలో సందిగ్ధం నెలకొంది. మార్చి 7.. శివరాత్రి పర్వదినాన లక్షలాదిగా వచ్చే భక్తులకు కోటప్పకొండ వద్ద పుణ్య స్నానాలు, తాగునీటి అవసరాలు తీరాలంటే సాగర్‌ కాలువలకు నీటి విడుదల తప్పనిసరి. ఇది సాధ్యం కాకపోవడంతో పండుగ నాటికి బుగ్గవాగు నీటిని కోటప్పకొండకు తీసుకురావడానికి జలవనరులశాఖ ప్రయత్నిస్తోంది. అయితే బుగ్గవాగులోనూ నీటినిల్వలు అడుగంటడంతో మోటార్లను పెట్టి నీటిని తోడి అందించాలనే నిర్ణయానికి వచ్చారు. బుగ్గవాగులో ప్రస్తుతం 1.2టీఎంసీ నీరు నిల్వ ఉంది. గత కొన్నేళ్లుగా పూడిక లెక్కలు తీయకపోవడంతో ఎంత నీరు నిల్వ ఉందన్న విషయమై స్పష్టత లేదు. దీనికితోడు బుగ్గవాగులోకి సాగర్‌ ప్రధాన కాలువతోపాటు మూడు వాగుల ద్వారా నీరు చేరుతోంది. బుగ్గవాగు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు కావడంతో నీటి నిల్వలు తగ్గేకొద్దీ వాగుల్లోనే కొంతనీరు మిగిలిపోతుంది. ఈలెక్కలు పరిగణలోకి తీసుకున్న జలవనరులశాఖ మోటార్ల ద్వారా పంపింగ్‌ చేయడానికి 0.7టీఎంసీ అందుబాటులో ఉంటుందని అంచనా వేసింది. రోజుకు 500 నుంచి 1000 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేసి కోటప్పకొండ వద్దకు తీసుకువచ్చేలా కార్యాచరణ రచిస్తున్నారు. నీటిని పంపింగ్‌ చేయడానికి రెండు సంస్థలు ఆసక్తి చూపడంతో ఆదివారం జలవనరులశాఖ ఉన్నతాధికారులు గుత్తేదారులతో సమావేశం కానున్నారు. నిబంధనల మేరకు పంపింగ్‌ చేయడానికి ఆసక్తి చూపేవారిని ఎంపికచేసి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు చేపడుతారు.

90కిలోమీటర్ల దూరం ప్రయాణం : బుగ్గవాగు నుంచి చేజర్ల మీదుగా గుంటూరు బ్రాంచ్‌ కెనాల్‌ అక్కడి నుంచి టెన్నార్‌ మేజరు ద్వారా కోటప్పకొండకు నీరు తీసుకురావాల్సి ఉంది. బుగ్గవాగు నుంచి సుమారు 90 కిలోమీటర్ల దూరం నీరు ప్రయాణించాల్సి ఉంది. బుగ్గవాగు వద్ద కాలువ 54 మీటర్ల వెడల్పుతో ఉంది. బుగ్గవాగులో 457.1 అడుగుల కంటే ఎక్కువగా నీటిమట్టం ఉంటేనే సాగర్‌ కాలువలోకి ప్రవహిస్తుంది. ప్రస్తుతం బుగ్గవాగులో 452 అడుగులు మాత్రమే నీటిమట్టం కొనసాగుతోంది. బుగ్గవాగు నుంచి ప్రారంభమయ్యే సాగర్‌ కాలువ 454 అడుగుల లెవల్‌తో ప్రారంభమవుతుంది. దీంతో బుగ్గవాగు నుంచి కాలువలోకి నీటిని మోటర్ల ద్వారా తోడి పోస్తారు. బుగ్గవాగు రెగ్యులేటర్‌కు కిలోమీటరు దూరంలో నీరు ఉండటంతో అక్కడి నుంచి నీటిని పంపింగ్‌ చేయాలి. నీటినితోడే కొద్దీ మట్టం తగ్గిపోవడంతో మరో 500మీటర్ల వరకు దూరం పెరుగుతుందని ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు. 500 క్యూసెక్కుల చొప్పున పంపింగ్‌ చేస్తే కాలువలో నీటిప్రవాహం ఎంతమేరకు ఉంటుంది? 1000 క్యూసెక్కులు పంపింగ్‌ చేయాలంటే ఎంత సామర్థ్యం ఉన్న మోటార్లు వినియోగించాలి? తదితర అంశాలపై కసరత్తు జరుగుతోంది. కాలువలో నీటిప్రవాహం వేగంగా ఉంటే గంటకు కిలోమీటరు దూరం నీరు ప్రయాణిస్తుంది. ప్రస్తుతం కాలువలు పూర్తిగా ఎండిపోవడం, నీటిప్రవాహం 500 లేదా 1000 క్యూసెక్కులు మాత్రమే అయితే ఆరకిలోమీటరుకు మించి దూరం సాధ్యమవుతుందా? అని యోచిస్తున్నారు. శివరాత్రి ఉత్సవాలు 7వతేదీ అయినప్పటికీ దూరప్రాంతాల నుంచి భక్తులు 5వ తేదీ నాటి నుంచి వస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని 5వతేదీకి నీరు తీసుకురావడానికి గల సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారు.

కృష్ణాబోర్డుపై ఆశలు : బుగ్గవాగు నుంచి నీటిని పంపింగ్‌ చేయడానికి సుమారు రూ.5కోట్ల వరకు వెచ్చించాలని ప్రాథమికంగా అంచనా. రూ.5 కోట్లు వెచ్చించినా పండుగ నాటికి నీరు అందుతుందా? లేదా? అన్న విషయమై సందిగ్ధం నెలకొంది. దీనిని దృష్టిలో ఉంచుకుని సోమవారం బోర్డు దృష్టికి తీసుకెళ్లి వెంటనే నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం కోరనుంది. మార్చి నెల 10వతేదీ నుంచి తాగునీటికి నీటిని విడుదల చేయనున్న దృష్ట్యా ప్రస్తుతం ఒక టీఎంసీ నీరు అయినా ఇస్తే బుగ్గవాగులో నీరు, సాగర్‌ నుంచి తీసుకునే నీటితో కోటప్పకొండ తిరునాళ్ల అవసరాలకు వాడుకుని మార్చి 10వతేదీ నుంచి తాగునీటికి ప్రకాశం, గుంటూరు జిల్లాలకు విడుదల చేయాలని జలవనరులశాఖ భావిస్తోంది. దీనివల్ల కాలువలో నీటినష్టాలు కూడా తగ్గుతాయని అంచనా. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశామని, పంపింగ్‌కు రూ.5కోట్ల డబ్బు వెచ్చించినా నీటిని సకాలంలో ఇవ్వలేమని, సాగర్‌ నుంచి నీటివిడుదలే శ్రేయస్కరమని జలవనరులశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈమేరకు ప్రభుత్వం కృష్ణానదీ యాజమాన్య బోర్డుతో చర్చించి పరిష్కారం చూపాల్సి ఉంది.

Forty thousand persons attends Mahashivaratri in year 1880

A MANUAL OF THE KISTNA DISTRICT IN THE PRESIDENCY OF MADRAS
GORDEN MACKENZIE
Publisher Lawrence Asylum Press
Year
1883
Pages 485
Book from the collections of
New York Public Library
The Government of Madras in Order No. 1,751, dated 23rd December 1880, entrusted Gordon Mackenzie (Madras Civil Service) with the duty of compiling the Manual of the Kistna District.
Eight miles south-west of Narasaravupett is the lofty hill of KotappaKonda where is held a festival at new moon in February attended by large numbers, perhaps as many as forty thousand persons. There is a considerable trade in timber at this fair. All sorts of wood from bamboo switches to logs and beams, are carted there and are sold before the day is over. There is no made road but as the festival occurs in dry weather the carts go across country without difficulty, except near the village of Yellamanda, where the jungle streams have laid bare small terraces of ‘Kankar’ or calcareous tufa. The temple of Ramalingasvami in this village must be ancient for it contains eight inscriptions, the dates ranging from A. D. 1131, when the Chola kings held this country, down to 1555, when it owned the sway of Sadasiva of Vijayanagar. The shrine upon the hill KotappaKonda, is comparatively modern. No inscription older than A. D. 1750 has been deciphered there, but there are several on hill, on a stone pillar near a lingam on the road to the hill and on a broken stone near a deserted temple to the south of the village, which have not been read, and may throw height on the history of this shrine. The temple, some 600 feet above the plain, is approached by a winding flight of stone steps, which at the festival are densely thronged with pilgrims ascending and descending, the light coloured prabhas or ensigns making the scene very gay and picturesque. Some of these prabhas are stretched over large frame-works drawn on carts by a team of oxen. The hill-top is 1,587 feet above sea level.

పల్లెల్లో ప్రభల పనుల సందడి

కోటప్పకొండ తిరునాళ్ల సమయం దగ్గర పడుతుండటంతో ఏటా క్రమం తప్పకుండా ప్రభలు కడుతున్న మద్దిరాల, యడవల్లి, పురుషోత్తంపట్నం, కావూరు, కమ్మవారిపాలెం, అప్పాపురం, అమీన్‌సాహెబ్‌పాలెం గ్రామాల్లో ప్రభల పనులు చకచకా చేస్తున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉంచుకున్న పొడుగు సరివి బారులను వరుసక్రమంలో తాళ్లతో ముడులు వేస్తూ కట్టేపనిలో నిమగ్నమయ్యారు. మద్దిరాల గ్రామస్థులు ఈ ఏడాది ప్రత్యేకంగా ఇనుముతో ప్రభకోసం బండిని తయారు చేశారు. ఐదేళ్ల నుంచి వరుసగా ప్రభను నిర్మిస్తున్న యడవల్లి తెలుగు యువత ఈసారి కూడా 95 అడుగుల ఎత్తులో ప్రభను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. గ్రామాల్లో ప్రభల నిర్మాణ పనుల్లో ప్రజలు పాల్గొంటుండడంతో సందడి వాతావరణం నెలకొంది.